పూడ్చలేని అగాధం..బాధాకరం
మన్మోహన్ సింగ్ కు సోనియా నివాళి
న్యూఢిల్లీ – డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఎంపీ సోనియా గాంధీ. తమ కుటుంబం గొప్ప నాయకుడిని, ఆత్మీయుడిని, మానవతావాదిని కోల్పోయిందని వాపోయారు. సమగ్రత, సానుకూలత, నిరాడంబరత, వినయం అన్నింటికి మించి అద్భుతమైన ప్రజ్ఞా పాటవాలు సింగ్ స్వంతమని, అలాంటి నేతలు అరుదుగా ఈ నేలపై జన్మిస్తుంటారని గుర్తు చేసుకున్నారు. తనకు మాటలు రావడం లేదని కన్నీటి పర్యంతం అయ్యారు.
ఈ దేశం అరుదైన, అసాధారణమైన నాయకుడిని, రాజకీయవేత్తను, ఆర్థిక రంగ నిపుణుడిని కోల్పోయిందన్నారు. ఇది దేశానికే కాదు తమ పార్టీకి, అంతకు మించి తనకు తీరని లోటు అని పేర్కొన్నారు. అత్యంత దూరదృష్టి కలిగిన నాయకుడని కితాబు ఇచ్చారు.
మాజీ ప్రధాని మరణంతో భారతదేశం దూరదృష్టి గల రాజనీతిజ్ఞుడిని, అభిశంసించలేని సమగ్రత కలిగిన నాయకుడిని, అసమానమైన పరిణతి కలిగి ఉన్న ఆర్థికవేత్తను కోల్పోయిందన్నారు అతని ఆర్థిక సరళీకరణ విధానం, హక్కుల ఆధారిత సంక్షేమ నమూనా కోట్లాది మంది భారతీయుల జీవితాలను గాఢంగా మార్చి వేసిందని కొనియాడారు. వాస్తవంగా భారతదేశంలో మధ్యతరగతిని సృష్టించి కోట్లాది మంది పేదరికం నుండి బయట పడేలా చేసిందని తెలిపారు ఖర్గే.