దయ కలిగిన మానవుడు
హైదరాబాద్ – ఆర్థికవేత్తగా దేశానికి చికిత్స చేశారు. మానవతావాదిగా సామాజిక బాధ్యతను గుర్తించారు. అంతకు మించి సంస్కరణలకు శ్రీకారం చుట్టి సంక్షోభం అంచుల నుంచి దేశాన్ని కాపాడాడు. చివరకు మౌనంగానే నిష్క్రమించాడు. ఏనాడూ ఎవరినీ నొప్పించిన దాఖలాలు లేవు డాక్టర్ మన్మోహన్ సింగ్ కు. ఆయనను ప్రధానమంత్రిగా కంటే ఆర్థికవేత్తగానే ఎక్కువగా గుర్తు పెట్టుకుంటారు. కారణం తను అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. కానీ వాటినన్నింటినీ మెల మెల్లగా విడదీసుకుంటూ , పరిష్కరించే ప్రయత్నం చేశారు. ఇందులో సవాళ్ల కంటే విమర్శలు ఉన్నాయి. అంతకు మించిన ఆరోపణలు ఉన్నాయి. కానీ ఇవేవీ కాలానికి నిలబడవు.
విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరిచినా ప్రపంచ మార్కెట్ లో ఇండియా పరువు గంగపాలు కాకుండా కాపాడడంలో తను సమిధిగా మారారు. ఇది కొందరికి మాత్రమే తెలుసు. సుదీర్ఘమైన ప్రయాణం. ప్రపంచ ఆర్థిక మేధావులు సైతం విస్మయం చెందేలా తనను తాను ప్రూవ్ చేసుకున్న వైనం లక్షలాది మందికి పాఠంగా ఉండి పోతుంది. వ్యవస్థలన్నీ డొల్లతనంతో ఊరేగుతున్న వేళ, నిరాదరణకు గురైన సంక్షుభిత సందర్భంలో తన అసాధారణమైన నిబద్దతతో కూడిన నిర్ణయాలతో గట్టెక్కించేందుకు చేసిన ప్రతి ప్రయత్నం ఎన్నదగినది. అంతకు మించి ఆహ్వానించదగినది.
సవాళ్లు ఎదురైన ప్రతీసారి డాక్టర్ గా ఆయన చికిత్స చేశారు. సంస్కరణల అనే మందులను ఇచ్చి కాపాడందుకు యత్నించారు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. కాదనలేని సందర్బం. ఆయన దేశాన్ని తాకట్టు పెట్టేందుకు ఇష్ట పడలేదు. కానీ గౌరవాన్ని మరింత ఇనుమడింప చేసేలా కృషి చేశారు. ఇది కొందరికి నచ్చక పోవచ్చు. మన్మోహన్ సింగ్ ను నిశ్శబ్ద ప్రధాని అని గేలి చేసిన వాళ్లు ఉన్నారు..అంతకంటే ఎక్కువగా ఎద్దేవా చేసిన వాళ్లు ఉన్నారు..కానీ ఇవాళ తను నిశ్శబ్దంగా నిష్క్రమించిన వేళ ..తాము చేసిన వ్యాఖ్యలు తప్పని తెలుసుకుని పశ్చాత పడుతున్నారు. ఇదీ మన్మోహన్ సింగ్ కు మిగతా నేతలకు ఉన్న తేడా..వ్యత్యాసం.
ఆయన రెండుసార్లు ప్రధానమంత్రిగా దేశానికి సేవలు అందించారు. ఆర్థిక రంగానికి ఆయువు పట్టుగా ఉన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సారథ్యం వహించారు. అన్నింటికంటే ఠీవీ పీవీకి నమ్మిన బంటుగా గుర్తింపు పొందారు. నిరంతర పాఠకుడు, రచయిత, మేధావి, రాజనీతిజ్ఞుడిగా ఎవరైనా పేర్కొన్నా వినమ్రంగా చూస్తూ వెళ్లి పోయారే తప్పా ఏనాడూ ఏమిటి అని నిలదీయలేదు. నిరాడంబరత, నిబద్దత, నిజాయితీ, పారదర్శకత, దూరదృష్టి, సునిశిత పరిశీలనా దృక్ఫథం, రాజీ పడని మనస్తత్వం …పేదలు, అణగారిన వర్గాల పట్ల సహానుభూతి కలిగిన దయ కలిగిన మానవుడు ..డాక్టర్ మన్మోహన్ సింగ్ .