శాసన సభలో నిప్పులు చెరిగిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం మార్చడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. శాసన సభలో జరిగిన చర్చలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పేదరికం, నిరుద్యోగం, వలసలు, శ్రమ దోపిడీ, వేతన అసమానతలను తగ్గించి అన్ని వర్గాల కోసం 2006 ఫిబ్రవరి 2 వ తేదీన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులోకి వచ్చిందన్నారు. ఈ పథకం ద్వారా కనీసం 100 రోజుల ఉపాధి కల్పించి కనీస వేతనం అందించే గ్యారెంటీ పథకమిదని అన్నారు. గడిచిన 20 ఏళ్లలో ఈ పథకం వల్ల ప్రయోజనం పొందిన వారిలో రాష్ట్రంలో 90 శాతం ఎస్సీలు, ఎస్టీలు, బీసీలున్నారని తెలిపారు సీఎం. వీరిలో 62 శాతం మహిళలు లబ్ది పొందారని చెప్పారు.
కొత్త చట్టం పేదల హక్కులకు వ్యతిరేకంగా ఉంది. ఉపాధి హామీ చట్టం అసలు ఉద్దేశం దెబ్బతీసేలా ఉంది. డిమాండ్ అనుగుణంగా పనుల ప్రణాళిక తయారు చేసే విధానానికి స్వస్తి పలికింది. డిమాండ్ ఆధారిత పాత విధానాన్ని కొనసాగించాలి. కొత్త చట్టం మహిళల కూలీలకు వ్యతిరేకంగా ఉందని ఆవేదన చెందారు. కొత్త చట్టంలో పొందుపరిచిన పరిమిత కేటాయింపుల పని దినాల వల్ల పేదలకు పని దినాలు తగ్గిపోతాయన్నారు సీఎం. మహిళా సాధికారత సాధించాలంటే పాత విధానం కొనసాగించాలని స్పష్టం చేశారు. పాత చట్టంలో వంద శాతం కేంద్రం నిధులు అందిస్తుండగా, కొత్త చట్టంలో 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్రాలు భరించాలన్న నిబంధన సమైక్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందన్నారు. రాష్ట్రాలపై అదనపు భారం పడుతుందన్నారు రేవంత్ రెడ్డి.






