తెలుగు భాషను కాపాడు కోవాలి
ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు
అమరావతి : రాను రాను తెలుగు భాష కనుమరుగు అయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు. మాతృ భాషను కాపాడు కోవాల్సిన అవసరం ఉందన్నారు. మన పిల్లలకు మన సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని తెలియ జేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉందని హితవు పలికారు. తెలుగు భాషను, సంస్కృతిని కాపాడుకుంటూ పూర్వ వైభవాన్ని తీసుకు రావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు స్పీకర్. తెలుగు ఖ్యాతిని దేశ విదేశాలకు చాటిచెప్పిన మహనీయుడు దివంగత నందమూరి తారకరామారావు అని స్పీకర్ కొనియాడారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ ద్వారానే సామాన్యులైన ఎంతో మంది రాజకీయాల్లోకి రాగలిగారని చెప్పారు. 25 ఏళ్ల వయసులో తనకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించి నేడు సభాపతి స్థానంలో కూర్చునేలా చేసింది ఎన్టీఆరేనని భావోద్వేగంతో పేర్కొన్నారు.
ప్రాథమిక విద్యాభ్యాసంలో మాతృభాష ఆవశ్యకతను నొక్కి చెప్పారు అయ్యన్నపాత్రుడు. ప్రభుత్వం తరఫున తెలుగు భాషాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ మహాసభల్లో మేధావులు చేసే తీర్మానాలను తనకు పంపాలని కోరారు. ఆ తీర్మానాలను రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి, చర్చించి, ప్రభుత్వం ద్వారా అమలు చేసేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సత్యసాయి బాబా సన్నిధిలో, ఎన్టీఆర్ కళావేదికపై ఈ కార్యక్రమం జరగడం ఆనంద దాయకమని పేర్కొన్నారు. మాట ఇచ్చిన ప్రకారం మూడు రోజులూ తాను ఈ సభల్లోనే ఉంటానని స్పష్టం చేశారు . ఈ కార్యక్రమంలో ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్వాహకులు గజల్ శ్రీనివాస్, పలువురు న్యాయమూర్తులు, సాహితీవేత్తలు, భాషాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






