సింహగిరిపై ఆన్ లైన్ కౌంటర్లు
విరాళాల స్వీకరణకు స్వైపింగ్ యంత్రాలు
సింహాచలం – దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్య క్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహాలక్ష్మీ నృసింహ స్వామిని దర్శించు కోవడానికి వచ్చే భక్తుల సౌకర్యార్ధం ఆలయ వర్గాలు వివిధ రకాల సదుపాయాలు కల్పిస్తున్నాయి.
ఈ నేపధ్యంలో సింహగిరి పైన ముఖ్య ప్రాంతాల్లో భక్తులు సమర్పించే విరాళాల స్వీకరణకు ఆన్ లైన్ కౌంటర్లు (స్వైపింగ్ మిషన్లు) అందుబాటులోకి తీసుకురావాలని ఆలయ ఇవో సింగం శ్రీనివాసమూర్తి భావించారు.
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో ఈ తరహా సేవలు అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు దేవాదాయశాఖ కసరత్తు చేస్తోంది. తాజాగా హెచ్ డిఎఫ్ సి స్టేట్ హెడ్ ఉదయ్ గుడిపాటితో పాటు మరికొందరు ప్రతినిధులు ఇవో శ్రీనివాసమూర్తి, ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు, దినేష్ రాజు, శ్రీదేవివర్మ, రామలక్ష్మి, రాజేశ్వరి, సువ్వాడ శ్రీదేవితో ఏఇఓ పాలూరి నరసింగరావు తో భేటీ అయ్యారు.
ఆన్ లైన్ విరాళాల స్వీకరణకు సంబందించిన వివరాలుతో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఇవో, ధర్మకర్తల మండలి లేవనెత్తిన పలు అంశాలకు సంస్థ ప్రతినిధి వివరించారు. అనంతరం సింహగిరిపైన పలు విరాళాల కౌంటర్లను హెచ్ డిఎఫ్ సి ప్రతినిధులు పరిశీలించారు.
ఈ సందర్భంగా ఇవో శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ సింహగిరిపై మొత్తం 22 ప్రత్యేక కౌంటర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. అయితే ఇందులో అన్నదానం, పిఆర్వో కార్యాలయం, ఆలయంలో మూడు చోట్ల తొలి విడతగా ఆన్ లైన్ స్వైపింగ్ మిషన్లు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.
రెండో విడతలో మిగిలిన ప్రాంతాల్లో ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ప్రధానంగా అన్నధానం విరాళాలకు సంబంధించి శాశ్వత, స్వల్ప విరాళాలకు రెండు స్వైపింగ్ యంత్రాలు, గో సంరక్షణకు సంబంధించి మరో యంత్రం అందుబాటులో ఉంటుందన్నారు.
ఇలా మూడు ప్రాంతాల్లో మూడు కౌంటర్లలో ఆన్ లైన్ ద్వారా విరాళాలు స్వీకరిస్తారన్నారు. మూడో పార్టీ ద్వారా విరాళాల స్వీకరణ అనుమతించమని నేరుగా దేవస్థానంతో ఆయా యంత్రాలు అనుసందానమై ఉంటాయన్నారు. హెచ్ డిఎఫ్ సి ఆయా ఆన్ లైన్ కౌంటర్లలో యంత్రాలను ఉచితంగానే అందజేస్తుందన్నారు.