స్పష్టం చేసిన దేవాదాయ శాఖ మంత్రి
అమరావతి : ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే విద్యుత్ చార్జీలను తగ్గించ బోతున్నామని వెల్లడించారు. ఇదే సమయంలో ప్రజలకు తీపి కబురు చెప్పారు. ట్రూ అప్ చార్జీలను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఏఎస్ పేట మండలం హసనాపురం గ్రామంలో మంత్రి పాత్రికేయులతో మాట్లాడారు. గత ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో ప్రజలపై విద్యుత్ చార్జీలతో పాటు ట్రూఅప్‌చార్జీల భారం మోపిందన్నారు. గత ఐదేళ్లలో సుమారు 32,166 వేల కోట్లను ట్రూఅప్ చార్జీల పేరుతో వసూలు చేసిందన్నారు. ఇక నుంచి ట్రూప్ చార్జీలను ప్రజల నుంచి వసూలు చేయకుండా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఒక సంవత్సరానికి మొత్తం రూ.4497 కోట్లను ప్రభుత్వం భరిస్తూ ప్రజల నుంచి వసూలు చేయకుండా రద్దు చేస్తున్నట్లు చెప్పారు.
విద్యుత్‌శాఖ తిరుపతి రీజియన్ పరిధిలో 1551.69 కోట్ల భారాన్ని ప్రజలపై వేయకుండా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఇంత మంచి నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కూటమి ప్రభుత్వానికి మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే గత ప్రభుత్వం విద్యుత్ చార్జీలను పెంచుకుంటూ పోతే తమ ప్రభుత్వం ఈ ఏడాదిలో కనీసం యూనిట్‌కు 40 పైసలు తగ్గించాలనే ఆలోచన చేస్తుందన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే పారిశ్రామిక రంగంలో పెట్టుబడుల విషయంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలిచినట్లు ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయం తాము ప్రకటించుకున్నది కాదనీ, దేశంలోనే పేరెన్నిక గల బ్యాంక్ ఆఫ్ బరోడా తమ సర్వేలో వెల్లడిరచినట్లు చెప్పారు. తమ ప్రభుత్వ 9 నెలల కాలంలోనే 25.3 శాతం పెట్టుబడుల శాతం పెరిగినట్లు ఆ నివేదికలో పేర్కొన్నట్లు చెప్పారు.






