మహిళల సాధికారత కోసం ప్రత్యేక ప్రాధాన్యత
విజయవాడ : ఏపీలో కూటమి ప్రభుత్వం అన్నివర్గాలకు సంక్షేమ ఫలాలు అందించేందుకు కృషి చేస్తోందని చెప్పారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. విద్య, ఉద్యోగావకాశాల్లో మహిళలకు 33.33 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కూడా సీఎం చంద్రబాబుదేనన్నారు. స్థానిక సంస్థల్లోనూ 34 శాతం రిజర్వేషన్లు కల్పించారన్నారు. బాలిక విద్య కోసం తల్లికి వందనం పథకం అమలు చేసి, ఇంట్లో ఎందరు పిల్లలుంటే అందరికీ ఈ పథకాన్ని వర్తింపజేశారన్నారు. మహిళల పేరున రేషన్ కార్డులు, ఇళ్ల పట్టాలు అందజేశారన్నారు. ప్రతి ఇంటి నుంచి మహిళా పారిశ్రామిక వేత్తను తయారు చేయాలన్న లక్ష్యంతో ఎంఎస్ఎంఈ పార్కుల్లో స్త్రీలకు అవకాశం ఇస్తున్నారన్నారు.
సావిత్రిబాయి పూలే ఆశయాల సాధనే లక్ష్యంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, రాష్ట్రంలో డ్వాక్రా సంఘాల ఆద్యుడు సీఎం చంద్రబాబు అని మంత్రి సవిత కొనియాడారు. అంతకు ముందు ఏపీ బీసీ ఉద్యోగుల ఫెడరేషన్ క్యాలెండర్ ను సవిత ఆవిష్కరించారు. ఉద్యోగుల సంక్షేమానికి సీఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యంం ఇస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి సత్యనారాయణ, డైరెక్టర్ మల్లికార్జున, అడిషనల్ డైరెక్టర్ చంద్రశేఖర్ రాజు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు వీరంకి వెంకట గురుమూర్తి, నందం అబద్ధయ్య, పేరేపి ఈశ్వర్, ఈశ్వరరావు, శ్రీధర్, వెంకటేశ్వరరాజు సహా పలువురు కార్పొరేషన్ల డైరెక్టర్లు, ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, ఏపీ బీసీ ఉద్యోగుల ఫెడరేషన్ ప్రతినిధులు కె.శ్రీనివాసులు, ఎం.ప్రసాద్, చలం, వి.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.






