పల్లెల అభివృద్దికి పాటు పడాలని పిలుపు
జగిత్యాల జిల్లా : తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ అభ్యర్థులు స్థానిక సంస్థల్లో గెలుపొందడం ఆనందంగా ఉందన్నారు ఆ పార్టీ చీఫ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ . కొండగట్టు పర్యటనలో భాగంగా ఇటీవల తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున సర్పంచులు, వార్డు మెంబర్లుగా విజయం సాధించిన అభ్యర్ధులు, బరిలోకి దిగిన అభ్యర్ధులతో సమావేశమయ్యారు. పార్టీ నుంచి గెలుపొందిన ప్రతి అభ్యర్ధికి పేరు పేరునా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తరఫున విజయం సాధించారు. మీరు మొదలు పెట్టిన ప్రయాణం కీలకమైనది. నేను పార్టీ పెట్టడానికి నాలో చైతన్యం నింపింది, నాకు ధైర్యం ఇచ్చింది తెలంగాణ నేల. నాకు తెలంగాణ పోరాట స్ఫూర్తి అంటే చాలా ఇష్టం. నేను ఇక్కడి నుంచి ఏమీ ఆశించడం లేదు.
మన దేశం, మన తెలుగు నేలకు జనసేన పార్టీ తరఫున చేయగలిగిన సేవ కలసికట్టుగా చేద్దాం తెలంగాణలో పుట్టిన పార్టీ మనది. ఇక్కడ ప్రజలకు అండగా నిలుద్దాం అని పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్. తెలంగాణకు బలమైన యువ నాయకత్వం అవసరం ఉంది. మీ స్థాయి, మీ ప్రాంతాన్ని బట్టి పోరాటం చేయండి. మీరంతా సైద్ధాంతిక బలంతో సహజంగా ఎదగాలని కోరుకుంటున్నాను. ఒక సిద్ధాంతం ఆధారంగా ఎదిగిన వారిని విభేదించడం కష్టం. అది నేను ప్రాక్టికల్ గా చేసి చూపాను. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలు విభిన్నంగా ఉంటాయి. తెలంగాణ నేల నాకు పోరాట శక్తి ఇచ్చింది. రాజకీయాల్లో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకున్నాను అంటే తెలంగాణ అమర వీరులు ఇచ్చిన స్ఫూర్తే కారణం. రజాకార్ల మీద వారు చేసిన సుదీర్ఘ పోరాటం నుంచి ఎంతో స్ఫూర్తి పొందాను.
సమయం ఇవ్వగలిగితే రాజకీయాల్లో మంచి స్థాయికి చేరుకోవచ్చు. 53 మంది విజయం సాధించారు. దశాబ్ద కాలం తర్వాత తెలంగాణలో దక్కిన విజయం ఇది. మీ అందరికీ ఆ కొండగట్టు ఆంజనేయస్వామి ఆశీస్సులు ఉండాలి. అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాలూ క్షేమంగా ఉండాలి. తెలుగు రాష్ట్రాల ప్రజల ఐక్యత కోసం కలసి పనిచేద్దాం అని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ తెలంగాణ ఇంఛార్జ్, టీటీడీ ఎల్.ఎ.సి. ఛైర్మన్ శంకర్ గౌడ్, పార్టీ ఉపాధ్యక్షులు, టీటీడీ బోర్డు మెంబర్ బి. మహేందర్ గౌడ్, పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, పార్టీ నాయకులు రాధారం రాజలింగం, ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, ఆర్.కె. సాగర్, శ్రీమతి శిరీష తదితరులు పాల్గొన్నారు.






