ప్రకటించిన మాజీ మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్ : ఏపీకి మేలు చేకూర్చేలా తెలంగాణ సర్కార్ ప్రయత్నం చేస్తోందని, నీళ్లను నిస్సిగ్గుగా నీళ్లను అప్పగించిందని ఆరోపించారు మాజీ మంత్రి హరీశ్ రావు. కేవలం కమీషన్ల కోసమే రేవంత్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును చేపట్టకుండా ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. సెక్షన్ 3 వస్తే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు 170 టీఎంసీలు ఎలా అయినా సాధించాలని కేసీఆర్ పట్టుబట్టి పనులు మొదలెట్టాడని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని 2 టీఎంసీల నుండి 1 టీఎంసీకి తగ్గించిందని అన్నారు. అసలు పాలమూరు పనులే జరగలేదని రేవంత్ రెడ్డి, ఉత్తమ్ అసెంబ్లీలో చెప్పిన అబద్ధాలు బహిర్గతం అయ్యాయని తెలిపారు. రాయలసీమ లిఫ్ట్ ఆపిందే నేను.. చంద్రబాబుకు నేను చెప్పగానే ఆపేశాడు అని రేవంత్ రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
రాయలసీమ ఎత్తిపోతలను అసలు బీఆర్ఎస్ అడ్డుకోలేదని చెప్తున్నాడని అన్నారు. రాయలసీమ ఎత్తిపోతలపై ఏపీ ప్రభుత్వం మే 5వ తేదీ 2020 జీవో జారీ చేసిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అంతకంటే 5 నెలల ముందే అంటే, 29, జనవరి 2020లో ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ కేంద్రానికి, కేఆర్ఎంబీ ఫిర్యాదు చేస్తూ లేఖ రాశామని చెప్పారు హరీశ్ రావు. ఇదిలా ఉండగా నీటి హక్కుల విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని 22 అక్టోబర్ 2020 నాడు జరిగిన రెండో అప్లెక్స్ కౌన్సిల్ లో బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రానికి తెగేసి చెప్పిందన్నారు. పర్యావరణ అనుమతి లేకుండా రాయలసీమ లిఫ్ట్ పనులు చేపట్టడంపై NGT లో కేసు వేసి ఫిబ్రవరి 24, 2021లో స్టే సాధించి పూర్తిగా ప్రాజెక్టు పనులు నిలిచి పోయేలా అడ్డుకున్నదే బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు.






