కీలక ప్రకటన చేసిన అచ్చెన్నాయుడు
విజయవాడ : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సంచలన ప్రకటన చేశారు. ఆదివారం ఆయన విజయవాడ క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిర్వీర్యమైన విద్యుత్ వ్యవస్థను గాడిన పెట్టేందుకు సంస్కరణలు చేపడుతోందని అన్నారు. త్వరలోనే విద్యుత్ ఛార్జీలను తగ్గించ బోతున్నామని తెలిపారు. ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచేదే లేదని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం వేల కోట్లు విలువైన ట్రూఅప్ భారాన్ని ప్రభుత్వం భరించిందని చెప్పారు. 2019–2024 కాలానికి సంబంధించి రూ.4,498 కోట్లు ట్రూఅప్ ఛార్జీలు వసూలు చేయాలంటూ ఏపీఆర్సీ లేఖ రాసినా, ఈ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని చెప్పడం చారిత్రాత్మక నిర్ణయంగా ఆయన పేర్కొన్నారు.
1999లో ఏపీఈఆర్సీ ఏర్పాటైన నాటి నుంచి తొలిసారి ట్రూడౌన్ ఛార్జీలు నమోదు కావడం, ముఖ్యమంత్రి చేపడుతున్న విద్యుత్ సంస్కరణల ఫలితం అని అన్నారు. ట్రూడౌన్ అమలు ద్వారా యూనిట్‌కు 13 పైసలు తగ్గాయని చెప్పారు అచ్చెన్నాయుడు. జగన్ రెడ్డి పాలనలో అక్వా రైతులకు యూనిట్ రూ.3.50 వసూలు చేస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత యూనిట్ రూ.1.50కు తగ్గించడం కీలక నిర్ణయం అన్నారు. గత ప్రభుత్వంలో రూ.5.19కు విద్యుత్ కొనుగోలు చేస్తే, ఇప్పుడు రూ.4.70కు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా తక్కువ ధరకే విద్యుత్ను కొనుగోలు చేస్తూ, రిన్యూవబుల్ ఎనర్జీకి ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు. సోలార్ పవర్ విద్యుత్ ఏర్పాటే లక్ష్యంగా ముందుకు సాగుతోందని అన్నారు






