ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు
గుంటూరు జిల్లా : తెలుగు భాష గొప్పదన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. సోమవారం గుంటూరు జిల్లాలో జరిగిన 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. మాతృ భాషలో చదువుకునే వారు రాణిస్తారని ఉద్ఘాటించారు. ఏ భాషా మరొక భాష కంటే గొప్పది లేదా తక్కువది కాదని, దేశవ్యాప్తంగా ప్రజలు ఒకరి భాషలను మరొకరు గౌరవించుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ప్రజలు ఒకరి భాషలను మరొకరు గౌరవించుకోవాలి. ఏ భాషా మరొక భాష కంటే గొప్పది లేదా తక్కువది కాదు అని స్పష్టం చేశారు. సాంకేతికత భాషలను నాశనం చేయదని, బదులుగా వాటి పరిరక్షణకు సహాయ పడుతుందని ఆయన అన్నారు. ఆంగ్లం అవసరమే అయినప్పటికీ, తన మాతృ భాషను మరచి పోవడం అంటే తన గుర్తింపును మరచి పోవడమేనని టీడీపీ అధినేత అన్నారు.
దేశంలో వందలాది భాషలు ఉన్నప్పటికీ, ఆరు ప్రాచీన భాషలలో ఒకటిగా ఉన్న తెలుగు మనకు గర్వకారణమని చంద్రబాబు నాయుడు అన్నారు. దాదాపు 10 కోట్ల మంది ప్రజలు తెలుగు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. 40 దేశాల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారని ఆయన అన్నారు పిల్లలకు భాషపై ప్రేమను నేర్పించాలని నొక్కి చెప్పారు. పొట్టి శ్రీరాములు పేరు మీద రాజమండ్రిలో తెలుగు విశ్వ విద్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. శ్రీరాములు గాంధేయవాది, స్వాతంత్ర సమరయోధుడు, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 1952లో ఆయన చేసిన 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిందని చెప్పారు. భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో ఆయన కీలక వ్యక్తిగా నిలిచారని అన్నారు.






