తక్షణమే నివేదిక తయారు చేయాలని ఆదేశం
తిరుపతి : టీటీడీ ఆధ్వర్యంలోని కళ్యాణ మండపాలపై సమగ్ర నివేదిక రూపొందించాలని ఆదేశించారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. తిరుమల, తిరుపతిలోని వసతి గృహాలలో ఎఫ్.ఎం.ఎస్ కు సంబంధించి ఇప్పటికే ఉన్న యాప్‌ను భక్తులకు మరింతగా అందుబాటులోకి తీసుకు రావాలని అనిల్ కుమార్ సింఘాల్ సూచించారు. భక్తులు ఆ యాప్‌ను సులభంగా డౌన్‌లోడ్ చేసుకునేలా క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేసి, తమ అభిప్రాయాలను స్వయంగా నమోదు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. టిటిడి వసతి గృహాలలో ఫెసిలిటీ మేనేజ్మెంట్ సేవలను మరింత మెరుగుపరచి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలన్నారు.
టిటిడి భూములు, స్థలాలు, ఇతర ఆస్తులపై స్థిరమైన , ఖచ్చితమైన రికార్డులు రూపొందించేందుకు నిపుణుల సహకారం తీసుకోవాలని సూచించారు. టిటిడి అనుబంధ ఆలయాలలో భక్తులకు దర్శన టికెట్లు, ఆర్జిత సేవలలో పాల్గొనే భక్తులకు బహుమానాల జారీ కొరకు టికెట్ స్కానింగ్ సదుపాయాలు కల్పించాలన్నారు. ఇంజనీరింగ్ విభాగంలో గుత్తేదారులకు సకాలంలో చెల్లింపులు చేపట్టాలని, టిటిడి వేద పాఠశాలల్లో బోధనా సిబ్బందిని భర్తీ చేయాలని స్పష్టం చేశారు. అటవీ విభాగంలో ఇంకా పూర్తి కాని పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే, టిటిడి ఆలయాలు, వసతి గృహాలలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఈవో సూచించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి జేఈవో వి. వీరబ్రహ్మం, సివిఎస్వో కే.వి. మురళీకృష్ణ, ఎఫ్.ఏ.అండ్ సీఏవో ఓ. బాలాజీ, సీఈ టి.వి. సత్యనారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు.







