కాంగ్రెస్ కు 40 సీట్లు కూడా రావు
నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ – ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ నిప్పులు చెరిగారు. పార్లమెంట్ సాక్షిగా ప్రతిపక్షాలను ఏకి పారేశారు. వాళ్లు కళ్లున్న కబోదులు అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి అంత సీన్ లేదన్నారు. దాని పనై పోయిందని అన్నారు. ఎక్స్పైరీ డేట్ కూడా ముగిసిందని స్పష్టం చేశారు.
దేశ వ్యాప్తంగా జరిగే సార్వత్రిక ఎన్నికల్లో 545 సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. ఇక ఇండియా కూటమి ఉందో లేదో జనానికి తెలియదన్నారు. తాము కాంగ్రెస్ పార్టీని ప్రత్యామ్నాయంగా చూడడం లేదన్నారు.
బీజేపీ సంకీర్ణ పార్టీలతో కూడిన ఎన్డీయే కూటమి కనీసం 400 సీట్లకు పైగా కైవసం చేసుకుంటుందని జోష్యం చెప్పారు నరేంద్ర మోదీ. గాంధీ ఫ్యామిలీ మాత్రమే కాంగ్రెస్ పార్టీలో చివరకు మిగులుతుందని షాకింగ్ కామెంట్స్ చేశారు.
ప్రజలు సుస్థిరమైన, మెరుగైన పాలనను కోరుకుంటున్నారని, దానిని తాము అందజేస్తున్నామని, అందుకే తాము ముచ్చటగా మూడోసారి గెలుస్తున్నామనే ధీమాతో ఉన్నామని కానీ ప్రతిపక్షాలకు అంత సీన్ లేదన్నారు నరేంద్ర మోదీ.