మోదీతో చంద్రబాబు ముచ్చట
కలిసి నడుద్దాం అంటూ ప్రతిపాదన
న్యూఢిల్లీ – రాజకీయాలలో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు అంటూ ఎవరూ ఉండరు. మొన్నటి దాకా కాంగ్రెస్ పార్టీతో జత కట్టిన టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఉన్నట్టుండి గేర్ మార్చారు. యూ టర్న్ తీసుకున్నారు. ఈసారి ఎన్నికల్లో తిరిగి బీజేపీతో కలిసి నడిచేందుకు ప్లాన్ చేశారు. ఆ మేరకు తెర వెనుక మంత్రాంగం నడిపారు. ఇప్పటికే 53 రోజుల పాటు ఆయన జైలు పాలయ్యారు. దెబ్బకు కోలుకోలేక పోయారు. ఏపీ సీఐడీ చంద్రబాబు నాయుడుపై 8 కేసులు నమోదు చేసింది.
ఈ సమయంలో ఈసారి ఎలాగైనా సరే ఏపీలో జెండా ఎగుర వేయాలని కంకణం కట్టుకున్నారు. విస్తృతంగా పర్యటించారు. ఓ వైపు యువ గళం పేరుతో నారా లోకేష్ కూడా ప్రచారం చేపట్టారు. ప్రజల నుంచి భారీ స్పందన లభించింది.
మరో వైపు జగన్ రెడ్డి కోటను బద్దలు కొట్టాలని డిసైడ్ అయిన చంద్రబాబు నాయుడు మాస్టర్ ప్లాన్ వేశారు. విచిత్రం ఏమిటంటే కేంద్రంలోని బీజేపీ ప్రాంతీయ పార్టీలతో ఫుట్ బాల్ ఆడుకుంటోంది. ఓ వైపు జగన్ రెడ్డికి భరోసా ఇస్తూనే ఇంకో వైపు టీడీపీని ఆహ్వానిస్తోంది. ఇంకో వైపు పవన్ కళ్యాణ్ మోదీకి నమ్మిన బంటు.
రాష్ట్ర ప్రయోజనాలు ఏమై పోతేనేం . ఓ వైపు స్టీల్ ప్లాంట్ ఇంకో వైపు ప్రత్యేక హోదా అటకెక్కాయి. ఇదంతా పక్కన పెడితే చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా మోదీతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.