శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.59 కోట్లు
దర్శించుకున్న భక్తులు 65,683
తిరుమల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కింది తిరుమల పుణ్య క్షేత్రం. మహిమలు కలిగిన దేవ దేవుడిగా కొలుస్తారు కోట్లాది మంది భక్తులు. ప్రపంచ వ్యాప్తంగా ఈ కలియుగ వైకుంఠ వాసుడికి భక్త బాంధవులు ఉన్నారు. స్వామి వారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.
ఇదిలా ఉండగా శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 65 వేల 683 మంది భక్తులు దర్శించుకున్నారు. 21 వేల 177 మంది తల నీలాలు సమర్పించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కార్య నిర్వహణ అధికారి ఏవీ ధర్మా రెడ్డి వెల్లడించారు.
నిత్యం భక్తులు సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.59 కోట్లు వచ్చినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం మూడు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని , ఎలాంటి టోకెన్లు లేకుండా సర్వ దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు కనీసం 8 గంటలకు పైగా సమయం పడుతుందని తెలిపారు.
ఇదిలా ఉండగా గత మూడు రోజులుగా తిరుమలలో చేపట్టిన ధార్మిక సదస్సు విజయవంతం అయ్యిందని స్పష్టం చేశారు. ఈ సందర్బంగా పీఠాధిపతులు, మఠాధిపతులకు ధన్యవాదాలు తెలిపారు.