రాహుల్ ఎఫెక్ట్ గెలిచే ఛాన్స్
100 సీట్లకు పైగానే పార్టీకి వస్తాయని సర్వే
న్యూఢిల్లీ – త్వరలో దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నగారా మోగనుంది. ఇప్పటికే అన్ని పార్టీలు ముందస్తుగా ప్రచారం ప్రారంభించాయి. ఆయా రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతోంది. మరో వైపు ముచ్చటగా మూడోసారి పవర్ లోకి వస్తామని ధీమాతో ఉన్నారు ప్రధాన మంత్రి మోదీ. భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్ మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తుందని పార్లమెంట్ సాక్షిగా ప్రకటించారు. అంతే కాదు కాంగ్రెస్ పార్టీకి 40 సీట్ల కంటే ఎక్కువ రావంటూ ఎద్దేవా చేశారు.
ఈ సమయంలో తాజాగా వెల్లడైన సర్వేలో ఊహించని రీతిలో కాంగ్రెస్ పార్టీకి సీట్ల సంఖ్య పెరగనుందని తేలింది. దీనికి ప్రధాన కారణం ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర వల్లనేని పేర్కొంది .
ఇక ఆయా రాష్ట్రాల వారీగా చూస్తే కాంగ్రెస్ పార్టీకి గతంలో కంటే ఈసారి గణనీయంగా సీట్లను కైవసం చేసుకోనుందని సమాచారం. తెలంగాణలో 12 నుంచి 14 సీట్లు , కర్ణాటకలో 10 నుంచి 12 సీట్లు , కేరళలో 16 నుంచి 18 సీట్లు, తమిళనాడులో 7 నుంచి 8 సీట్లు వస్తాయని సర్వేలో తేలింది.
ఇక అస్సాంలో 3 నుంచి 4 సీట్లు, హర్యానాలో 2 నుంచి 3 సీట్లు , నార్త్ ఈస్ట్ లో 2 నుంచి 3 సీట్లు, నార్త్ ఇండియా లోని యూపీలో 2 రాజస్తాన్ లో 3 నుంచి 4 , మధ్య ప్రదేశ్ లో 3, ఛత్తీస్ గఢ్ లో 4 నుంచి 5 సీట్లు వస్తాయని అంచనా.
బీహార్ లో 2 నుంచి 3 సీట్లు, ఒడిస్సాలో 2 నుంచి 3, జార్ఖండ్ లో 3 నుంచి 4 , జమ్మూ కాశ్మీర్ లో 2 , ఉత్తరాఖండ్ లో 2 , మహారాష్ట్రలో 4 నుంచి 5 , పశ్చిమ బెంగాల్ లో 2 నుంచి 3 , పంజాబ్ లో 8 నుంచి 9 , గోవాలో 1 సీటు వస్తుందని సర్వేలో తేలింది. మొత్తం గా కాంగ్రెస్ పార్టీకి సింగిల్ గా 100 నుంచి 102 స్థానాల దాకా కైవసం చేసుకునే ఛాన్స్ లేక పోలేదని పేర్కొంది.