ఇసుక అమ్మకాలకు కొత్త పాలసీ
సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
హైదరాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో ఇసుక అక్రమ అమ్మకాలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గతంలో చోటు చేసుకున్న ఘటనలను ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని స్పష్టం చేశారు సీఎం.
ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఇసుక అమ్మకాలకు కొత్త పాలసీని తయారు చేయాలని సీఎస్ ను ఆదేశించారు. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చటంతో పాటు ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండే విధి విధానాలు ఉండేలా కొత్త పాలసీ రూపొందించాలని అధికారులకు సూచించారు. ఏపీ, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.
ఇప్పుడు రాష్ట్రంలో అమల్లో ఉన్న ఇసుక పాలసీ అవినీతి దందాగా మారిందని ముఖ్యమంత్రి అన్నారు. అన్ని స్థాయిల్లో అక్రమాలు జరుగుతున్నాయని అధికారులను అప్రమత్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి జరుగుతున్న ఇసుక క్వారీయింగ్, అక్రమ ఇసుక రవాణాను వెంటనే అరికట్టాలని ముఖ్యమంత్రి హెచ్చరించారు. 48 గంటల్లో అన్ని స్థాయిల్లో అధికారులు తమ పద్ధతి మార్చుకోవాలని డెడ్ లైన్ విధించారు.
రెండు రోజుల తర్వాత విజిలెన్స్, ఏసీబీ విభాగాలను రంగంలోకి దింపాలని అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల్లో వెంటనే తనిఖీలు చేపట్టాలని, బాధ్యులైన ఏ ఒక్కరినీ వదిలిపెట్టవద్దని సీఎం హెచ్చరించారు.
అన్ని రూట్లలో ఉన్న టోల్ గేట్ల వద్ద నమోదైన డేటా ఆధారంగా ఇసుక లారీల అక్రమ రవాణా మొత్తం బయటకు తీయాలని ఆదేశించారు. ఇప్పుడున్న ఇసుక రీచ్ లు, డంప్ లను అన్నింటినీ తనిఖీలు చేయాలని, తప్పులుంటే జరిమానాలు వేస్తే సరిపోదని, అంతకు మించి కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.
టీఎస్ఎండీసీ కేంద్రంగా జరుగుతున్న అక్రమాలను అరికట్టి, గనులు, భూగర్భ వనరుల విభాగాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరముందని సీఎం అన్నారు.