కేసీఆర్ పై రాములమ్మ కన్నెర్ర
కాళేశ్వరం పై సమాధానం చెప్పాలి
హైదరాబాద్ – మాజీ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు విజయశాంతి నిప్పులు చెరిగారు. రాష్ట్రాన్ని పదేళ్లపాటు పాలించిన దొర పూర్తిగా సర్వ నాశనం చేశాడని ఆరోపించారు. ఆయన వల్లనే ఇవాళ ఖజానా ఖాళీ అయ్యిందన్నారు.
అంతులేని అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారిందని ఆవేదన చెందారు విజయ శాంతి. ఎవరి కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారో చెప్పాలన్నారు. కేవలం కల్వకుంట్ల ఫ్యామిలీ కోసం, కాంట్రాక్టర్లకు లబ్ది చేసేందుకే దీనిని కట్టారని ధ్వజమెత్తారు.
ఎక్కడైనా పారే నీళ్లను ఉపయోగించుకుని ప్రాజెక్టులు నిర్మిస్తారని, కానీ దానికి విరుద్దంగా నీళ్లను ఎత్తి పోసే సిస్టమ్ ను ఎలా ఉపయోగిస్తారో చెప్పాలని ప్రశ్నించారు విజయ శాంతి. కేవలం 20,000 కోట్లతో అయిపోయే ప్రాజెక్టు కోసం ఏకంగా రూ. 1,20,000 కోట్లు ఖర్చు చేయడం దారుణమన్నారు.
మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి పిల్లర్స్ కూలి పోయే స్థితికి చేరుకున్నాయని, భారీ వర్షాలు వస్తే పూర్తిగా కొట్టుకు పోయే అవకాశం ఉందన్నారు.