
10 మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్ లో
శ్రీ సత్యసాయి జిల్లా : ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని 10 మెడికల్ కాలేజీలను పీపీపీ మోడల్ ద్వారా నిర్మించాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారని మంత్రి ఎస్ .సవిత వెల్లడించారు. ఈ నిర్ణయంపై జగన్ విషం కక్కుతున్నారని ఆమె మండిపడ్డారు. ప్రజారోగ్యం మెరుగు పడడం జగన్ కు ఇష్టం లేదన్నారు. అందుకే మెడికల్ కాలేజీల నిర్మాణానికి టెండర్లు వేస్తే, తమ ప్రభుత్వం వస్తే రద్దు చేస్తానని హెచ్చరికలు దిగుతున్నాడని అన్నారు. పోలీసులను, ఉద్యోగులను బెదిరించడం ఆయనకు అలవాటుగా మారిందన్నారు. జగన్ బెదిరింపులకు రాష్ట్రంలో భయపడే వారేవరూ లేరన్నారు. కియా పరిశ్రమ నిర్మాణం సమయంలోనూ జగన్ ఇటువంటి అవాకులు చవాకులు పేలాడని మండిపడ్డారు. కియా పరిశ్రమకు ఇచ్చిన భూములు తిరిగి ఇప్పించేస్తానని ఆనాడు చెప్పాడన్నారు.
కియా, దాని అనుబంధ పరిశ్రమల వల్ల లక్షలాది మందికి ఉపాధి లభిస్తోందని చెప్పారు. జీఎస్టీ, పన్నుల రూపంలో రాష్ట్రానికి ఆదాయం వస్తోందన్నారు. కియా పరిశ్రమ వల్ల జగన్, ఆయన బ్యాచ్ ఎక్కువగా లబ్ధి పొందిందని ఆరోపించారు ఎస్. సవిత. సీఎం చంద్రబాబును, డిప్యూటీ సీఎం పవన్ ను, మంత్రి అచ్చెన్నాయుడును బావిలో పడి చావాలని జగన్ అనడంపై మంత్రి సవిత తీవ్రంగా స్పందించారు. ఇదేనా ఎమ్మెల్యేగా మాట్లాడే తీరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బావిలో ఎవరి పడి చావాలో గత సాధారణ ఎన్నికల్లోనూ, ఇటీవల జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజలు ఇప్పటికే స్పష్టమైన తీర్పు చెప్పారని తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గురించి జగన్ కు మాట్లాడే అర్హత లేదని మంత్రి సవిత స్పష్టంచేశారు