
తిరిగి పరీక్షలు నిర్వహించాలని ఆందోళన
హైదరాబాద్ : తెలంగాణలో నిర్వహించిన గ్రూప్ -1 పరీక్షలు పూర్తిగా లోపభూయిష్టంగా ఉన్నాయని, వెంటనే రద్దు చేసి తిరిగి నిర్వహించాలని కోరుతూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్శిటీ లోని లైబ్రరీ బిల్డింగ్ వద్ద పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు అభ్యర్థులు. ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు రాష్ట్ర హైకోర్టు ఇచ్చిందని, అయినా మొండిగా కాంగ్రెస్ సర్కార్, సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు ఆందోళనకారులు. కోట్ల రూపాయలు చేతులు మారాయని, వేలాది మంది ఆశలపై నీళ్లు చల్లారంటూ వాపోయారు బాధిత అభ్యర్థులు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు ఇప్పటి వరకు ముగ్గురు చైర్మన్లు మారారని అయినా పరీక్షల నిర్వహణలోనూ ఎలాంటి మార్పులు తీసుకు రాలేక పోయారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇందులో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని, సిట్టింగ్ జడ్జితో లేదా సీబీఐతో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఒకే గదిలో పరీక్షలు రాసిన అభ్యర్థులకే జనరల్ ర్యాంకులు వచ్చాయని దీనిపై తమకు అనుమానం ఉందని పేర్కొన్నారు. కొన్నేళ్ల పాటు గ్రూప్ -1 కోసం కష్టపడి చదివి రాస్తే , తెలుగు మీడియం అభ్యర్థులకు తీవ్రంగా అన్యాయం జరిగిందని కన్నీటి పర్యంతం అయ్యారు. దీనికంతటికి సీఎం , సర్కారే కారణమని ఆరోపించారు.