బీఆర్ఎస్ అవినీతిపై విచారణ చేపట్టాలి
బీఎస్పీ చీఫ్ ప్రవీణ్ కుమార్ డిమాండ్
హైదరాబాద్ – బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలపై వెంటనే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. శనివారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ గడ్డ మీద గత దశాబ్దంలో జరిగిన విచ్చలవిడి దోపిడిలో రాజకీయ నాయకుల స్వైర విహారం ఒక ఎత్తైతే, మరోవైపు ఉన్నతాధికారులు కూడా ఇందులో కీలక భాగస్వాములు కావడం అత్యంత బాధాకర
మని పేర్కొన్నారు.
తాజాగా ఏసీబీ జరిపిన దాడుల్లో హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ దగ్గర కోట్ల విలువైన అక్రమ ఆస్తులు దొరకడం ఒకటైతే, ఆయన దగ్గర కొంత మంది కీలకమైన ఉన్నతాధికారుల అక్రమ ఆస్తుల వివరాలు కూడా ఉండడం అత్యంత జుగుప్సాకరమైన విషయమని స్పష్టం చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
తెలంగాణ పోలీసు శాఖ అధిపతిగా పనిచేసి ఇప్పుడు కీలకమైన స్థానంలో ఉన్న మరొక అధికారి పై వేల కోట్ల అక్రమ ఆస్తులున్నాయని హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు కావడం మన దురదృష్టమన్నారు.
గత ప్రభుత్వంలో రహస్య జీవోల ముసుగులో ఎన్నో కుంభకోణాలు జరిగాయో. వీటికి సంభందించిన మౌఖిక ఆదేశాలు ఎవరిచ్చిండ్రు? ఇప్పుడు భూదందా/ రియల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతి ఆఫీసర్ వెనకాల ఒక శివబాలక్రిష్ణ ఉన్నడు ఒక గాడ్ ఫాదర్ ఉన్నడని ఆరోపించారు .
కుల, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా దోషుల నందరిని శిక్షించి వాళ్ల అక్రమ ఆస్తులను స్వాధీనం చేసుకోక పోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తుందని హెచ్చరించారు.