హామీలు బారెడు అమలు మూరెడు
నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ – ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ఆయన చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర కొనసాగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి మాయ మాటలు చెప్పడం మోదీ ప్రారంభించారని ఆరోపించారు. అయినా జనం నమ్మే స్థితిలో లేరన్నారు.
శనివారం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు రాహుల్ గాంధీ . ప్రజా సమస్యలను గాలికి వదిలేసి కేవలం వ్యాపార ప్రయోజనాలను పరిరక్షించేందుకు మాత్రమే ప్రధానమంత్రి పని చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ దేశం ఎటు పోతుందో అర్థం కావడం లేదన్నారు.
మోడీ పాలనలో ప్రస్తుత ఆర్థిక పరిస్థితికి సంబంధించిన చీకటి సత్యాన్ని దాచి పెట్టే ప్రయత్నం చేస్తోందంటూ ధ్వజమెత్తారు రాహుల్ గాంధీ. నోట్ల రద్దు తర్వాత పూర్తిగా దేశ భవిష్యత్తు అంధకారంలో మునిగి పోయిందన్నారు. ఎంఎస్ఎంఈ రంగాన్ని నాశనం చేశారని, ఉపాధికి ఇబ్బంది ఏర్పడిందని , ప్రపంచ ఆకలి సూచికలో ఇండియా స్థానం 111వ ర్యాంకుకు పడి పోయిందని ధ్వజమెత్తారు .
ప్రస్తుతం భారతీయ రూపాయి వెంటిలేటర్ పై ఉందని ఆవేదన వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. ఇకనైనా మోదీ ప్రచారంపై పెట్టే శ్రద్ద ఆచరణలో సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తే బావుంటుందని సూచించారు.