రాముడి పేరుతో రాజకీయం
మాజీ సీఎం అఖిలేష్ యాదవ్
ఉత్తర ప్రదేశ్ – సమాజ్ వాది పార్టీ చీఫ్ , మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ నిప్పులు చెరిగారు. శాసన సభలో ఆయన ప్రస్తుత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏకి పారేశారు. అయోధ్యలో శ్రీరాముడి ఆలయం పేరుతో రాజకీయం చేయడం మానుకోవాలని హితవు పలికారు.
ఈ సందర్బంగా అఖిలేష్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మనం పుట్టనప్పుడు ఈ లోకంలో శ్రీరాముడు ఉన్నాడని, మనం చని పోయాక కూడా రాముడు ఉంటాడని స్పష్టం చేశారు. కోట్లాది మందికి శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు ఆదర్శ ప్రాయంగా ఉంటారని ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
కానీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తానే శ్రీరాముడిని తయారు చేసినట్లు భావించుకుంటున్నారని ఇది మంచి పద్దతి కాదన్నారు. ఈ దేశంలో ప్రతి ఒక్కరికి వారి వారి విశ్వాసాల మీద నమ్మకం ఉంటుందన్నారు. కానీ కులం పేరుతో, మతం పేరుతో రాజకీయాలు చేయడం మాత్రం దారుణమన్నారు అఖిలేష్ యాదవ్.
ఇకనైనా చిల్లర రాజకీయాలు మానుకోవాలని , ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు మాజీ సీఎం.