14 నుంచి జనసేనాని ప్రచారం
ఉభయ గోదావరి జిల్లాలపై ఫోకస్
అమరావతి – ఏపీలో దూకుడు పెంచారు జనసేన పార్టీ చీఫ్ , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈసారి ఎలాగైనా సరే వైసీపీని సాగనంపాలని, జగన్ మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలని డిసైడ్ అయ్యారు. ఒక్క పార్టీ నుంచి గెలవడం కష్టమని గమనించారు పవన్ కళ్యాణ్. ఈ మేరకు నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీతో జత కట్టారు. తాజాగా భారతీయ జనతా పార్టీతో కూడా అంటకాగారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు.
పొత్తులపై క్లారిటీ వచ్చినట్టే ఉంది. చంద్రబాబు నాయుడు హుటా హుటిన ఢిల్లీకి వెళ్లారు. ఆ వెంటనే ట్రబుల్ షూటర్ , కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా , ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన షా త్వరలోనే పొత్తులపై క్లారిటీ వస్తుందన్నారు.
ఈ తరుణంలో మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఈ జిల్లాల్లో 34 సీట్లు ఉన్నాయి. క్లీన్ స్వీప్ చేయాలని డిసైడ్ అయ్యారు పవన్ కళ్యాణ్. ఈనెల 14 నుండి 17 వరకు పర్యటిస్తారని జనసేన పార్టీ వెల్లడించింది.