NEWSANDHRA PRADESH

అన్ని పార్టీలు కాషాయానికి దాసోహం

Share it with your family & friends

సంచ‌ల‌న కామెంట్స్ చేసిన కేఏ పాల్

విజ‌య‌వాడ – అన్ని రాజకీయ పార్టీలు కేంద్రంలో ఉన్న బిజెపికి దాసోహం అవుతున్నాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు డాక్టర్ కే ఏ పాల్ విమర్శించారు. ఆర్ఎస్ఎస్ దేశానికి అతిపెద్ద ప్రమాదకరిగా మారిందని, బిజెపి, ఆర్ఎస్ఎస్ కబంధ హస్తాల్లో దేశం ప్రమాదకరమైన స్థితిలో ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు .

విజయవాడ ఏపీయూడబ్ల్యూజే భవన్ లో ఆదివారం డాక్టర్ కే ఏ పాల్ తో మీట్ ది ప్రెస్ జరిగింది .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన పాల్ మాట్లాడారు. దేశం ప్రమాదకరమైన స్థితిలో ఉందని ,దాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉందని పిలుపునిచ్చారు.

అంతర్జాతీయ శాంతి దూతగా ఉన్న తాను దేశాలు వదిలేసి తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు తిరుగుతున్నాను అనే దానిపై రకరకాల ఊహాగానాలు చేస్తున్నారని పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాశాంతి పార్టీని స్థాపించటం, దేశాన్ని, ఏపీని శాంతియుతంగా అభివృద్ధి పథంలో పయనింప జేయటానికి తాను శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నానని పేర్కొన్నారు .

డాక్టర్లు, ఐఏఎస్ ,ఐపీఎస్ ఎంతోమంది సీనియర్లు ప్రజాశాంతి పార్టీలో చేరుతున్నారని ఆయన పేర్కొన్నారు . 54 శాతం ఓటు బ్యాంకు ఉన్న పార్టీగా ప్రజాశాంతి పార్టీ నిలిచిందని తెలిపారు. మోడీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

ఎన్టీఆర్ ఏ కులం వారైనా పేద బడుగు వర్గాల ప్రజల కోసం పోరాటం చేసినట్టు కొనియాడారు. ఎన్టీఆర్ కు ఎందుకు భారతరత్న ఇవ్వలేదని ప్రశ్నించారు. బాల యోగిని కుట్రజేసి చంపేశారని ఆరోపించారు. .తాను అధికారంలోకి వస్తే 10 లక్షల కోట్లు ఒక్క సమ్మిట్ ద్వారా తీసుకొచ్చి దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ప‌య‌నించేలా చేస్తానని డాక్టర్ కే ఏ పాల్ వెల్లడించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన దగ్గరకు వచ్చి ఎకనామిక్ సమ్మిట్ పెట్టమని కోరితే తాను దానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ స్వస్థత పరచాలని ఆయన్ని పరామర్శించి ప్రార్థించినట్లు తెలిపారు. అటు దేశం ఇటు రాష్ట్రాలు అప్పుల కుప్పలో కూరుకు పోతున్నాయని ప్రతి వ్యక్తి పైన కోటి రూపాయల అప్పు ఉందని వీటిని తీర్చే సత్తా తనకే ఉందని పేర్కొన్నారు .