NEWSANDHRA PRADESH

వైసీపీకి చ‌ర‌మ గీతం పాడాలి

Share it with your family & friends

మాజీ మంత్రి కొణ‌తాల రామ‌కృష్ణ‌

అన‌కాప‌ల్లి – మాజీ మంత్రి కొణ‌తాల రామ‌కృష్ణ నిప్పులు చెరిగారు. ఏపీ స‌ర్కార్ పై ధ్వ‌జ‌మెత్తారు. ఆయ‌న ఇటీవ‌లే వైసీపీ కండువా క‌ప్పుకున్నారు. తాజాగా సీఎం జ‌గ‌న్ రెడ్డిని, ఆయ‌న పార్టీని ఏకి పారేశారు. ఆదివారం కొణ‌తాల రామ‌కృష్ణ మీడియాతో మాట్లాడారు.

ఏపీలో విద్యా వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి భ్రష్టు పట్టించారని ఆరోపించారు. నిరుద్యోగులను మోసం చేసేలా వైసీపీ సర్కారు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో 25 వేల డీఎస్సీ పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా 6,100 పోస్టులను భర్తీ చేస్తున్నామని ప్ర‌క‌టించ‌డం దారుణ‌మ‌న్నారు.

ఇదంతా ఎన్నిక‌ల ముందు ప్ర‌క‌టించ‌డం అంటే ల‌బ్ది పొంద‌డం త‌ప్ప మ‌రోటి కాద‌న్నారు. న‌వ ర‌త్నాలు పేరుతో జ‌నం చెవుల్లో పూలు పెట్టార‌ని ఆరోపించారు కొణ‌తాల రామ‌కృష్ణ‌. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించక పోవడం దారుణమన్నారు.

పోలవరం, ఉత్తరాంధ్ర సృజల స్రవంతి ప్రాజెక్టు పనులు పూర్తి కావడం లేదని చెప్పారు. భూ యాజమాన్యం రక్షణ చట్టం పేరుతో ప్రజలను భయ భ్రాంతులకు గురిచేస్తున్నారని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు రావాలనుకున్న ఈ చట్టాన్ని గుజరాత్ రాష్ట్రంలో కూడా అమలు చేయలేదని, కానీ ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేయాలని జగన్ తహతహా లాడుతున్నారని అన్నారు.

జనసేన – టీడీపీ కూటమి రాబోయే రోజుల్లో అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే భూ యాజమాన్య రక్షణ చట్టం రద్దు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న వైసీపీ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో చరమగీతం పాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని కొణతాల రామకృష్ణ హెచ్చరించారు.