రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ
పాలమూరు జిల్లా : అమ్మాయిలు చదువుకునేందుకు తమ ప్రభుత్వం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ. మహబూబ్ నగర్ ఐఐఐటీ భవనాల నిర్మాణం కోసం సీఎంతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా అక్కడి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. శ్రీవిద్య అనే విద్యార్థిని మాట్లాడుతూ.. తాను యూపీఎస్సీ ఎగ్జామ్‌లో మంచి ర్యాంక్ సాధించి ఐఏఎస్ అవుతానని ఆత్మవిశ్వాసంతో చెప్పింది. మంత్రి స్పందిస్తూ చదువులో, నాయకత్వ లక్షణాల్లో అమ్మాయిలే ముందుంటున్నారు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ఆడపిల్లల చదువంటేనే ఎక్కువ మక్కువ అని చెప్పారు.
ఈ సందర్బంగా సీఎం బాలికల విద్య కోసం తీసుకుంటున్న చర్యలను మంత్రి వివరించారు. విద్యార్థిని ఇంగ్లీషులో మాట్లాడిన తీరు, ఆమె కమ్యూనికేషన్ స్కిల్స్‌ను దామోదర ప్రత్యేకంగా అభినందించారు.
ఐఏఎస్ కావాలన్న విద్యార్థుల లక్ష్యాలకు మంత్రి అక్కడికక్కడే స్ఫూర్తిని నింపారు. వేదికపై ఉన్న విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా, జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి, మహిళా ఐపీఎస్ అధికారినిని విద్యార్థులకు చూపిస్తూ మీరు కోరుకున్న లక్ష్యానికి ప్రతీకలు ఇక్కడే ఉన్నారు. యోగితా రాణా కశ్మీర్ నుంచి వచ్చి ఇక్కడ సేవలందిస్తున్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకోండి అని వారిని విద్యార్థులకు పరిచయం చేశారు. ముగ్గురు అధికారిణులతో మాట్లాడించి, విద్యార్థిణులు ఇన్‌స్పైర్ అయ్యేలా చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి, తూడి మేఘారెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జనంపల్లి అనిరుధ్ రెడ్డి పాల్గొన్నారు.





