దర్శకుల సంఘం అధ్యక్షుడిగా వీరశంకర్
వీర శంకర్ ప్యానెల్ ఘన విజయం
హైదరాబాద్ – తెలుగు సినిమా రంగానికి సంబంధించి దర్శకుల సంఘానికి ఎన్నికలు జరిగాయి. ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠకు తెర పడింది. ప్రముఖ దర్శకుడు వీర శంకర్ దర్శకుల సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
ఆయన ప్యానెల్ గ్రాండ్ విక్టరీ నమోదు చేయడం విశేషం. తెలుగు ఫిలిం ఛాంబర్ లో తెలుగు సినీ దర్శకుల సంఘానికి ఎన్నికలు జరిగాయి. మొత్తం 1113 ఓట్లు పోల్ అయ్యాయి. ప్రెసిడెంట్ గా వీర శంకర్ కు భారీ మెజారిటీ దక్కింది. ఆయన ఏకంగా 232 ఓట్ల తేడాతో సముద్రపై గెలుపొందారు.
దర్శకుల సంఘం ఉపాధ్యక్షులుగా వశిష్ట , రాజేష్ ఎన్నికయ్యారు. వశిష్టకు 576 ఓట్లు రాగా సాయి రాజేష్ కు 355 ఓట్లు వచ్చాయి. ఇక ప్రధాన కార్యదర్శిగా సుబ్బారెడ్డి ఎన్నికయ్యారు. విచిత్రం ఏమిటంటే ఆయన కేవలం 2 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆయన మద్దినేని రమేష్ పై గెలుపొందారు. ఆయనకు 394 ఓట్లు వచ్చాయి. సుబ్బారెడ్డికి 396 ఓట్లు పోల్ అయ్యాయి.
సంయుక్త కార్యదర్శులుగా వడ్డాణం రమేష్ , కస్తూరి శ్రీనివాస్ , ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా ప్రియదర్శి, వంశీ కృష్ణ , కోశాధికారిగా పీవీ రామారావు ఎన్నికయ్యారు.