ప్రకటించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి
పాలమూరు జిల్లా : ఆరు నూరైనా పాలమూరును అభివృద్ది చేసి తీరుతానంటూ ప్రకటించారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం చిట్టబోయిన పల్లి లో 200 కోట్ల రూపాయలతో ఈ రోజు IIIT కి భూమి పూజ చేయడం ఆనందంగా ఉందన్నారు. పాలమూరు చరిత్రలో ఇదొక చారిత్రక ఘట్టంగా నిలిచి పోతుందన్నారు. ఈ శుభ కార్యక్రమం తర్వాత విద్యార్థులతో కాసేపు ముచ్చటించడం సంతోషంగా ఉందన్నారు. పాలమూరు జిల్లా దశాబ్దాలుగా వెనకబడి ఉండటానికి విద్య అవకాశాలు లేకపోవడం తప్ప మరోటి కాదన్నారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తికాక పోవడమే ప్రధాన కారణం అని ఆరోపించారు. ఇన్నేళ్ల తర్వాత ఆ తప్పులు దిద్దుకుని పాలమూరులో అభివృద్ధిని పరుగులు పెట్టించి, దేశానికే ఆదర్శంగా ఈ జిల్లాను నిలుపే అవకాశం వచ్చిందన్నారు రేవంత్ రెడ్డి.
విద్య, సాగునీటి రంగాల్లో పాలమూరును దేశానికే ఆదర్శంగా నిలబెడతామని ప్రకటించారు. ఏడాది లో ఐఐఐటీ భవనం సిద్ధం చేస్తాం అన్నారు. లక్ష్యం ఉన్నతంగా ఉండాలని స్పష్టం చేశారు. అందుకు కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. భాషను, జ్ఞానాన్ని పెంచుకోవడానికి చిత్తశుద్ధితో పనిచేయాలని అన్నారు. మీలోని నిబద్ధత, క్రమశిక్షణతో కూడిన విద్య మిమ్మల్ని సమాజంలో ఉన్నతంగా నిలబెడుతుందని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. ఉజ్వలమైన భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్న విద్యార్థినీ విద్యార్థులందరికీ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.





