ఆక్రమణలకు గురైన స్థలాలను రక్షించాలి
హైదరాబాద్ : హైడ్రా నిర్వహించిన ప్రజావాణికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. ప్రభుత్వ స్థలాలు, పార్కులు ఆక్రమణకు గురవుతున్నాయని వాటిని కబ్జాకోరుల నుంచి రక్షించాలని కమిషనర్ ఏవీ రంగనాథ్ కు ఫిర్యాదు చేశారు. ఈమేరకు వినతి పత్రాలు సమర్పించారు. మొత్తం 43 ఫిర్యాదులు వచ్చాయని ఈ సందర్బంగా తెలిపారు కమిషనర్. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం, హైదరగూడలోని సంజీవనీ హిల్స్ పార్క్ ఆక్రమణకు గురవుతోందని స్థానికులు ఫిర్యాదు చేశారు. పార్క్ బౌండరీ వాల్‌ను అక్రమంగా ధ్వంసం చేసి, సొసైటీ భవనం నిర్మిస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల పరిసర ప్రాంతంలో హరిత స్థలాలు గణనీయంగా తగ్గిపోయి నట్టయ్యిందన్నారు. ఈ పార్క్‌ను కాపాడి నివాసితులకు ప్రాణవాయువును అందించాలని హైడ్రాకు అందజేసిన వినతి పత్రంలో పేర్కొన్నారు.
ఎల్.బి.నగర్ సమీపంలోని ప్రాంతంలో ఉన్న బైరామల్గూడ చెరువు సుమారు 6.30 ఎకరాల విస్తీర్ణంలో ఉందని తెలిపారు. ఈ చెరువు అభివృద్ధి కోసం రూ.5 కోట్ల నిధులు మంజూరైనప్పటికీ గత 5 సంవత్సరాలుగా ఆశించిన స్థాయిలో పనులు జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు స్థానికులు. దీని కారణంగా డ్రైనేజ్ నీరు నేరుగా చెరువులోకి చేరుతోందని తెలిపారు. దీంతో తీవ్ర కాలుష్యానికి గురవుతూ, పరిసర ప్రాంతాల ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారిందని స్థానికులు హైడ్రా ప్రజావాణి లో వాపోయారు.హైడ్రా జోక్యం చేసుకుని చెరువును అభివృద్ధి చేయాలని కాకతీయ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు విన్నవించారు.





