కేసీఆర్ ధన దాహం కాళేశ్వరం
నిప్పులు చెరిగిన రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల కష్టార్జితంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ధన దాహానికి బలైందని ధ్వజమెత్తారు. రూ. 97 వేల కోట్లు ఖర్చు చేసినా
97 వేల ఎకరాలకు కూడా నీళ్లివ్వలేదని అధికారిక లెక్కలు చెబుతున్నాయని తెలిపారు.
ప్రాజెక్టు డిజైన్ నుండి నిర్మాణం వరకు అన్నీతానై కట్టానని చెప్పిన కేసీఆర్, మేడిగడ్డ కూలి నెలలు గడుస్తున్నా నోరు విప్పడం లేదంటూ ప్రశ్నించారు. కనీసం మరమ్మతులకు పనికి రాదన్నారు.
పూర్తిగా పునర్ నిర్మాణం చేయాల్సిందేనని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ అభిప్రాయపడిందని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో వాస్తవాలు తెలంగాణ సమాజానికి తెలిపే ప్రయత్నం చేసేందుకే తాము మేడిగడ్డ టూర్ చేపట్టామని చెప్పారు సీఎం. కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులను కూడా ఆహ్వానించామని అన్నారు..
బీఆర్ఎస్ తో పాటు వారి చీకటి మిత్రులు బీజేపీ శాసన సభ్యులు మేడిగడ్డకు రావడం లేదన్నారు. కాళేశ్వరం చంద్రశేఖర్ రావుకు ఎటీఎంలా మారిందని ప్రధాని మొదలు గల్లీ లీడర్ వరకు లొల్లి చేసే బీజేపీ నాయకులు..వాస్తవాలు చూడడానికి క్షేత్రస్థాయికి ఎందుకు రాలేక పోయారని ప్రశ్నించారు.
అన్నీ పార్టీల శాసన సభ్యులు ఒక వైపు ఉంటే బీజేపీ, బీఆర్ఎస్ మాత్రం ఒకటిగా ఒక వైపు ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు. మేడిగడ్డ పర్యటనతో తెలంగాణ సమాజం తొమ్మిదిన్నరేళ్లు కేసీఆర్ పాలనలో విధ్వసమైన జలదృశ్యాన్ని కళ్లారా చూడబోతోందన్నారు.