ఏఐ డేటా సెంటర్ కు సంబంధించిన విషయాలపై చర్చ
దావోస్ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలకంగా మారారు దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో. మంగళవారం దావోస్‌లో గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ తో చర్చించారు. తిరిగి కలవడం నాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు . ఈ సందర్భంగా విశాఖపట్నంలోని గూగుల్ ఏఐ డేటా సెంటర్‌కు సంబంధించిన విషయాలపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు సీఎం . ఈ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడానికి దాని పనులను వేగవంతం చేయడం గురించి కూడా ప్రస్తావనకు వచ్చిందన్నారు. వ్యాపార కార్యకలాపాలను వేగవంతం చేయాలనే తమ నిబద్ధతకు అనుగుణంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున పూర్తి మద్దతు ఉంటుందని మరోసారి స్పష్టం చేసినట్లు చెప్పారు. .
ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో సహకారాన్ని మరింతగా పెంచడం గురించి చర్చించడానికి వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ (WIPO) డైరెక్టర్ జనరల్ డారెన్ టాంగ్‌ను కలవడం ఆనందంగా ఉందన్నారు నారా చంద్రబాబు నాయుడు. ఐపీ వాల్యుయేషన్‌లో స్టార్టప్‌లకు శిక్షణ ఇవ్వడానికి అమరావతిలో WIPO–ఆంధ్ర ఐపీ అకాడమీని ఏర్పాటు చేయడం, ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక ఇంధన మిషన్‌కు మద్దతుగా WIPO GREENను ఏకీకృతం చేయడం పై దృష్టి సారించామన్నారు. 2029 నాటికి అమరావతి , విశాఖపట్నంలను ప్రపంచంలోని అగ్రశ్రేణి ఇన్నోవేషన్ క్లస్టర్‌లలో ఉంచడానికి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌ను ఉపయోగించడం గురించి చర్చించామన్నారు.





