newsseals.com
News

పాద‌యాత్ర‌కు శ్రీ‌కారం ప్ర‌భుత్వంపై యుద్దం

VijayaBhaskar January 23, 2026
newsseals-YSJagan
Spread the love

వైఎస్ఆర్ఎస్పీ అధ్య‌క్షుడు జ‌గ‌న్ రెడ్డి

ఏలూరు జిల్లా : మాజీ ముఖ్య‌మంత్రి, వైఎస్సార్సీపీ బాస్ వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలో ప‌రిస్థితులు దారుణంగా ఉన్నాయ‌ని, ప్ర‌భుత్వంపై యుద్దం ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు పాద‌యాత్ర‌కు శ్రీ‌కారం చుడ‌తాన‌ని వెల్ల‌డించారు. ఇకనుంచి తాను ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర ప్రారంభిస్తానని జగన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఏడాదిన్నర పాటు పూర్తిగా ప్రజల్లోనే ఉంటానని, ప్రతి వారం ఒక నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ అవుతానని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ఏలూరు నియోజకవర్గంతో మొదలు పెడుతున్నామని అన్నారు.

చంద్రబాబు పాలన మొత్తం అబద్ధాలు, మోసాలేనని ఆరోపించారు జగన్ రెడ్డి. ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. రెడ్‌బుక్ రాజ్యాంగంతో ఎవరితోనైనా ఎలా కావాలంటే అలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పోలీస్ వ్యవస్థను కూడా దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.
ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దారుణంగా మారిందని జగన్ అన్నారు. ఒకప్పుడు ప్రభుత్వ స్కూళ్లకు డిమాండ్ ఉండేదని, ఇప్పుడు విద్యార్థులు భారీగా చదువు మానేస్తున్నారని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, గత ప్రభుత్వం హయాంలో చేపట్టిన మెడికల్ కాలేజీలను కూడా ఈ ప్రభుత్వం ప్రైవేటీకరిస్తోందని జగన్ ఆరోపించారు.