సీఎం కాకుండా అడ్డుకున్న చిరంజీవి
బొత్స సత్యనారాయణ కామెంట్స్
అమరావతి – ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మెగాస్టార్ చిరంజీవిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను గనుక కాంగ్రెస్ పార్టీలో చేరక పోయి ఉండి ఉంటే సీఎం అయ్యేవారని పేర్కొన్నారు.
అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు తనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చిందన్నారు. కానీ అప్పుడు తాను సీఎం కాకుండా చిరంజీవి అడ్డు పడ్డాడని ఆరోపణలు చేశారు. ఆ తర్వాత తానే పీసీసీ చీఫ్ హోదాలో మెగాస్టార్ కు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించానని చెప్పారు.
బుధవారం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు అన్నీ ఒక్కటైనా వైసీపీని ఎదుర్కోలేరని పేర్కొన్నారు. తాము రెండోసారి పవర్ లోకి రావడం ఖాయమని జోష్యం చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. వై నాట్ 175 అనేది తమ నినాదమని పేర్కొన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా తమ సర్కార్ సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని చెప్పారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. త్వరలోనే ఎవరు గెలుస్తారనేది తేలనుందన్నారు బొత్స సత్యనారాయణ.