రేవంత్ రెడ్డీ జర నోరు జాగ్రత్త
కడియం శ్రీహరి వార్నింగ్
హైదరాబాద్ – మాజీ డిప్యూటీ సీఎం , స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సీరియస్ అయ్యారు. అసెంబ్లీలో ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి అనుచిత భాష మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. బుధవారం మీడియా పాయింట్ వద్ద ఆందోళనకు దిగారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు.
ప్రజలు ఓట్లు వేస్తేనే తాము ప్రజా ప్రతినిధులం అయ్యామని, కానీ ఏనాడూ ఇలాంటి భాషను వాడడం చూడలేదన్నారు శ్రీహరి. చెప్పలేని భాషను సీఎం వాడుతున్నారంటూ వాపోయారు. ఇంకోసారి తమ పట్ల అనుచితంగా వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు.
ఆయన మాట్లాడిన మాటలు అసెంబ్లీ రికార్డుల్లోకి వెళుతున్నాయని, ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. రికార్డులను తొలగించాలని కోరితే తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అడ్డుకున్నారంటూ వాపోయారు కడియం శ్రీహరి.
రేవంత్ రెడ్డి వాడిన మాటలకు తాము బదులు ఇవ్వగలమని, కానీ పార్లమెంటరీ సంప్రదాయాల మీద గౌరవం ఉందన్నారు . ప్రతిపక్ష నేత కేసీఆర్ పై సీఎం దిగజారి మాట్లాడటం సరి కాదన్నారు.