తెలంగాణ అద్భుతం కాళేశ్వరం
మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు
హైదరాబాద్ – మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోస పూరితమైన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించారు. హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ తమపై బురద చల్లే ప్రయత్నం చేస్తోందంటూ ధ్వజమెత్తారు.
లక్ష కోట్లు నీళ్ల పాలు చేయలేదని, రాష్ట్రానికి మేలు చేకూర్చేందుకే తాము ప్రాజెక్టును చేపట్టడం జరిగిందని చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కాదని అది తెలంగాణ రాష్ట్రానికి తల మానికమని పేర్కొన్నారు తన్నీరు హరీశ్ రావు.
అది తెలంగాణ ప్రజలకు జీవ ధార అని కొనియాడారు. ఎన్ని విచారణలు చేపట్టినా, ఎంత మందిని విచారణకు ఆదేశించినా తమకు ఒరిగేది ఏమీ ఉండదన్నారు. తాము ఎవరికీ భయపడే ప్రసక్తి లేదన్నారు . మొత్తం ఈ ప్రాజెక్టు ద్వారా 20 లక్షల ఎకరాలకు కాళేశ్వరం ద్వారా ప్రయోజనం చేకూరడం ఖాయమని జోష్యం చెప్పారు. ముందు మా మీద బురద చల్లడం మానుకోవాలని సూచించారు. రైతులకు అన్యాయం చేయొద్దంటూ కోరారు తన్నీరు హరీశ్ రావు.