NEWSTELANGANA

అభివృద్ధిలో బంజారాలు కీల‌కం

Share it with your family & friends

సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ – రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి బంజారాల‌ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. దొర‌ల రాజ్యం పోవాల‌ని, పేద‌ల రాజ్యం రావాల‌ని మీరంతా కోరుకున్నార‌ని పేర్కొన్నారు సీఎం. బంజారా భవన్ లో సంత్ శ్రీ సేవాలాల్ 285 జయంతి ఉత్సవాలు చేప‌ట్టారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు రేవంత్ రెడ్డి.

బంజారా సోదరులను కలవడమంటే కాంగ్రెస్ కుటుంబ సభ్యులను కలుసుకున్నంత ఆనందం త‌న‌కు క‌లుగుతుంద‌న్నారు. 1976లో ఇందిరమ్మ బంజారాలను ఎస్టీ జాబితాలో చేర్చడం జ‌రిగింద‌న్నారు. రాష్ట్ర స్ధాయి ప్రభుత్వ ఉద్యోగాల్లో బంజారాలు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు సీఎం.

దామాషా ప్రకారం నిధులు కేటాయించిన ఘనత సోనియాగాంధీద‌ని స్ప‌ష్టం చేశారు. మీ ఆశీర్వాదంతో తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందన్నారు. సేవాలాల్ జయంతిని ఆప్షనల్ హాలిడేగా ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు రేవంత్ రెడ్డి.

సేవాలాల్ జయంతి ఉత్సవాలు జరిపేందుకు కోటి కాదు మరో కోటి జత చేసి రూ.2 కోట్లు విడుదల చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. తక్షణమే జీవో మంజూరు చేయాలని అధికారులకు ఆదేశిస్తున్నాన‌ని అన్నారు.

అన్ని తండాల్లో పాఠ‌శాల‌లు నిర్మించే బాధ్య‌త త‌మ ప్ర‌భుత్వం తీసుకుంటుంద‌న్నారు.