శ్రీవారి రథ సప్తమికి భారీ భద్రత
ఏర్పాట్లు పూర్తయ్యాయన్న ఎస్పీ
తిరుమల – తిరుమలలో టీటీడీ ఆధ్వర్యంలో 16న నిర్వహించే రథ సప్తమి ఉత్సవాలను పురస్కరించుకుని భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు తిరుపతి ఎస్పీ మల్లిక గార్గ్. భక్తుల భద్రతే పోలీసుల ప్రధాన కర్తవ్యమని స్పష్టం చేశారు. భక్తి భావంతో విధులు నిర్వహిస్తూ, భక్తులతో మర్యాద పూర్వకంగా, సహనంగా మెలగాలని సూచించారు ఎస్పీ.
ఇందులో భాగంగా తిరుమల కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ చేస్తున్నట్లు చెప్పారు. తిరుమలకు చేరుకునే ఘాట్ రోడ్లు, తిరుమల పరిసర ప్రాంతాలలో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నామన్నారు.
ఇదిలా ఉండగా ఒకే రోజు 7మ వాహనాలలో తిరుమల మాడ వీధుల్లో ఊరేగనున్నారు. చిన్నపిల్లలు తప్పిపోకుండా ఉండేందుకు తప్పనిసరిగా జియో ట్యాగింగ్ ను అమలు చేస్తున్నట్లు చెప్పారు. నిర్దేశిత పార్కింగ్ ఏరియాలలోనే భక్తులు తమ వాహనాలను పార్కింగ్ చేయాలని సూచించారు ఎస్పీ.
భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని ఎలాంటి ఘటనలు లేకుండా చూసుకోవాలన్నారు.