జగన్ లూటీ చేస్తున్నా చర్యలేవి
జగన్ రెడ్డిపై నిప్పులు చెరిగిన మాణిక్కం ఠాగూర్
అమరావతి – ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విశాఖలో గత మూడు రోజులుగా బూత్ స్థాయి సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో అతి పెద్ద స్థాయిలో అక్రమంగా మైనింగ్ జరుగుతోందని కేంద్రం నివేదిక ఇచ్చిందన్నారు.
అయితే మోదీ ప్రభుత్వం ఎందుకని మౌనంగా ఉందంటూ ప్రశ్నించారు. జగన్ సర్కార్ పై చూసీ చూడనట్లు వ్యవహరించడం వెనుక ఎవరు ఉన్నారో తెలియాలన్నారు. దేశంలోని వనరులను ఇప్పటికే బడా బాబులకు కట్టబెట్టారని, ఇక ఏపీలో జగన్ రెడ్డి అందినంత మేర దోచి పెడుతున్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాణిక్కం ఠాగూర్.
వందల కోట్లు లెక్కల్లో చూపని డబ్బులను జగన్ లూటీ చేస్తున్నా ఎందుకని నోరు మెదపడం లేదన్నారు. అక్రమ మైనింగ్ ను అరికట్టాలని తమ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. లేక పోతే తాము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు.