కాంగ్రెస్ లో చేరిన నీలం మధు
పార్టీ గెలుపు కోసం కృషి చేస్తా
హైదరాబాద్ – తాజాగా జరిగిన శాసన సభ ఎన్నికల్లో పటాన్ చెరు నుంచి టికెట్ ఆశించి భంగ పడిన ప్రముఖ నాయకుడు నీలం మధు ముదిరాజ్ ఎట్టకేలకు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన ఇదే పార్టీ నుంచి టికెట్ ఆశించారు. కానీ ఈ ప్రాంతంలో ప్రస్తుత ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న దామోదర రాజ నరసింహను కాదని టికెట్ కేటాయించే పరిస్థితి లేదు.
దీనిని దృష్టిలో పెట్టుకుని పార్టీ హైకమాండ్ సైతం వెనుకంజ వేసింది. మొత్తంగా పార్టీ పరంగా రేవంత్ రెడ్డి పట్టు పెంచుకునేందుకు ప్రతి నియోజకవర్గంలో తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతానికి అంతా సైలెంట్ గా ఉన్నప్పటికీ ఎవరు ఎప్పుడు తమ గొంతు విప్పుతారో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో పలువురు టికెట్ రాని వాళ్లంతా ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు.
బీఆర్ఎస్ నుంచి రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే వన్నాడ ప్రకాశ్ గౌడ్ , పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత తో పాటు బీఆర్ఎస్ సీనియర్ లీడర్లు మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియోద్దీన్ , ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి సైతం కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా పటాన్ చెరులో కీలకమైన నేతగా ఎదిగిన నీలం మధు ముదిరాజ్ ఇవాళ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.