తిరుమలలో వైభవంగా చక్ర స్నానం
భక్తులకు శ్రీ మలయప్ప అభయం
తిరుమల – సూర్య జయంతిని పురస్కరించుకుని శుక్రవారం తిరుమలలో ‘రథసప్తమి’ ఉత్సవాన్ని టీటీడీ వైభవంగా నిర్వహించింది. మధ్యాహ్నం స్వామి పుష్కరిణిలో చక్రస్నానం వేడుకగా జరిగింది. అంతకు ముందు ఉదయం చిన్నశేష, గరుడ, హనుమంత వాహనాలపై శ్రీ మలయప్ప స్వామి వారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు .
మధ్యాహ్నం 2 నుండి 3 గంటల మధ్య చక్రస్నానం వైభవంగా జరిగింది. శ్రీవరాహ స్వామి వారి ఆలయం వద్ద గల స్వామి పుష్కరిణిలో చక్రత్తాళ్వార్లకు పాలు, పెరుగు, నెయ్యి, తెనె, చందనంతో అర్చకులు అభిషేకం నిర్వహించారు. ఈ అభిషేక కైంకర్యాన్ని అందుకుని చక్రత్తాళ్వార్ ప్రసన్నుడయ్యాడు. అధికారులు, భక్తులు పుష్కరిణిలో పవిత్రస్నానాలు ఆచరించారు.
శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైనది గరుడ వాహనం. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. దాస్య భక్తితో కొలిచే భక్తులకు తాను దాసుడినవుతానని గరుడ వాహనం ద్వారా స్వామివారు తెలియజేస్తాడు. మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని స్వామివారు భక్త కోటికి తెలియ చెపుతున్నారు.