NEWSNATIONAL

కేంద్రం నిర్వాకం రైతుల ఆగ్ర‌హం

Share it with your family & friends

దేశ వ్యాప్తంగా ర‌హ‌దారుల దిగ్భంధ‌నం

న్యూఢిల్లీ – రైతులు చేప‌ట్టిన ఛ‌లో ఢిల్లీ కార్య‌క్ర‌మం ఉద్రిక్తంగా మారింది. దేశ రాజ‌ధాని ఢిల్లీని చుట్టు ముట్టారు అన్న‌దాత‌లు. త‌మ‌కు ఇచ్చిన హామీల‌ను మోదీ స‌ర్కార్ అమ‌లు చేయ‌డం లేదంటూ మండిప‌డ్డారు . క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర ఇవ్వ‌కుండా ఇబ్బందుల‌కు గురి చేస్తున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు. మొత్తం 12 డిమాండ్ల‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరుతున్నారు.

నిర‌స‌న‌లో భాగంగా సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) శుక్ర‌వారం భార‌త్ బంద్ కు పిలుపునిచ్చారు. పంజాబ్ లోని చాలా చోట్ల రైతులు రైలు ప‌ట్టాల‌పై ప‌డుకుని ఆందోళ‌న‌కు దిగారు. దీంతో ఇప్పటికే రైల్వే శాఖ పలు రైళ్ల రాకపోకలను నిలిపి వేసింది. పంజాబ్‌ లోని లూథియానా- సాహ్నేవాల్‌- చండీగఢ్‌ మార్గంలో 6 రైళ్లను దారి మళ్లించారు.

ఈ దేశ వ్యాప్త సమ్మెకు యునైటెడ్‌ కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) పిలుపునిచ్చింది. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామిక పనులు మూసి వేయాలని కోరారు. చాలా చోట్ల హైవే లపై ఆందోళనకు దిగారు.

దేశ వ్యాప్తంగా పలు కార్మిక సంఘాలు కూడా భారత్‌ బంద్‌ కు మద్దతు ప్రకటించాయి. అయితే, భారత్‌ బంద్‌కు సంబంధించి ఢిల్లీ పోలీసులు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో నిఘా పెంచారు. గౌతమ్‌ బుద్ధ నగర్‌ జిల్లాలో 144 సెక్షన్‌ విధించడంతో పాటు సింగు, తిక్రీ, ఘాజీపూర్‌ సరిహద్దుల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు.