ఖాకీలా లేక వైసీపీ కార్యకర్తలా
నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిల
అమరావతి – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా తమ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలను టార్గెట్ చేస్తూ పోలీసులు దాడులు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు.
అసలు పోలీసులు ఉన్నది ప్రజల కోసమా లేక అధికార పార్టీకి అడుగులకు మడుగులు ఒత్తడం కోసమా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య యుతంగా నిరసన తెలిపితే బూట్లతో తొక్కిస్తారా , గొంతు పిసికి చంపాలని చూస్తారా అంటూ ఫైర్ అయ్యారు.
వైసీపీ గూండాలను పక్కన పెట్టి మరీ దాడులు చేయిస్తారంటూ అంటూ వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. మీరు పోలీసులా లేక కిరాయి మనుషులా అని ఫైర్ అయ్యారు. ఇష్టా రాజ్యంగా కొట్టేందుకు మీకు హక్కు ఎవరు ఇచ్చారంటూ నిలదీశారు.
సత్తెనపల్లిలో యూత్ కాంగ్రెస్ నాయకులను పోలీసులు నిర్దాక్షిణ్యంగా కొట్టడాన్ని తీవ్రంగా పరిగణించారు. ఇందుకు సంబంధించి తాము మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. అసలు డీజీపీ ఉన్నారా లేక నిద్ర పోతున్నారా అంటూ మండిపడ్డారు షర్మిల.