గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలి
జై భారత్ చీఫ్ జేడీ లక్ష్మీ నారాయణ
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫిబ్రవరి 25న జరగబోయే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని జై భారత్ నేషనల్ పార్టీ చీఫ్ జేడీ లక్ష్మీ నారాయణ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 5 వేల మందికి పైగా ఈ పరీక్ష రాస్తున్నారని తెలిపారు.
ఇదే పరీక్ష జరిగే సమయంలో కీలకమైన బ్యాంక్ కు సంబంధించి ఎగ్జామ్స్ కూడా ఉన్నాయని పేర్కొన్నారు. రెండు పరీక్షలు ఒకేరోజు నిర్వహించడం వల్ల అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని స్పష్టం చేశారు జేడీ లక్ష్మీ నారాయణ.
ఇటీవల వెలువడిన ఎస్.బి.ఐ క్లర్క్ మెయిన్స్ పరీక్ష తేదీ కూడా ఫిబ్రవరి 25 తేదీనే కావడంతో చాలా మంది అభ్యర్థులు ఎదో ఒక్క పరీక్షనే ఎంచుకునే దుస్థితి నెలకొందన్నారు. ఆరేళ్ళ తర్వాత వచ్చిన గ్రూప్-2 నోటిఫికేషన్ కోసం ఎందరో ఎదురు చూస్తున్నారని తెలిపారు.
ఇక 2019 తరువాత ఎస్.బి.ఐ. క్లర్క్ నోటిఫికేషన్ రావడం మళ్ళీ ఇపుడే అని జేడీ చెప్పారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, ఏపీపీఎస్ యంత్రాంగం వెంటనే స్పందించి, పరీక్ష తేదీ వాయిదా వేయాలని కోరారు. అభ్యర్థులకు వచ్చిన ఈ రెండు అవకాశాలను ఉపయోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు జేడీ లక్ష్మీ నారాయణ.