జగన్ రెడ్డికి వేల కోట్లు ఎక్కడివి..?
నిలదీసిన జనసేన నేత నాగ బాబు
అమరావతి – జనసేన పార్టీ నాయకుడు, ప్రముఖ నటుడు నాగ బాబు కొణిదెల సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వైసీపీ పాలన గాడి తప్పిందన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పేదోడికి పెత్తందార్లకు మధ్య రాబోయే ఎన్నికల్లో యుద్దం జరుగుతోందని సీఎం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు నాగ బాబు.
రాష్ట్రంలో ప్రజలు స్వేచ్ఛగా బతికే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏం కష్టం చేస్తే ఇన్ని వేల కోట్లు జగన్ మోహన్ రెడ్డి వెనకేసుకున్నారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు జనసేన నాయకుడు.
పదుల సంఖ్యల్లో భవంతులు, వేల కోట్ల బ్యాంక్ బ్యాలెన్సులు , లక్షల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో, ఎవరిని బెదిరింపులకు గురి చేస్తే, దోచుకుంటే వచ్చాయో తేలాలన్నారు నాగ బాబు. టీడీపీ, జనసేన పార్టీ కూటమి రాబోయే ఎన్నికల్లో గెలుస్తుందన్నారు.
తాము అధికారంలోకి వచ్చాక జగన్ మోహన్ రెడ్డితో పాటు ఆయన పరివారం తిన్నదంతా కక్కిస్తామని హెచ్చరించారు. ఇకనైనా వైసీపీ నేతలు మారాలని, నిరాధార విమర్శలు, ఆరోపణలు చేయొద్దంటూ సలహా ఇచ్చారు నాగ బాబు.