కబ్జా కోరు బండ్ల గణేష్
హీరా గ్రూప్ సీఈవో ఫైర్
హైదరాబాద్ – హీరా గ్రూప్ ముఖ్య కార్య నిర్వహణ అధికారి నౌహీరా షేక్ సంచలన కామెంట్స్ చేశారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నటుడు, నిర్మాత , కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బండ్ల గణేశ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
బండ్ల గణేశ్ కు తన ఇంటిని అద్దెకు ఇచ్చానని , తాను చూసేందుకని వెళితే తనపై ఆక్రమణ చేసుకున్నానంటూ కేసు పెట్టారంటూ ఆరోపించారు. రూ. 75 కోట్ల విలువ చేసే తన ఇంటిపై బండ్ల గణేశ్ కన్నేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి భారీ స్కెచ్ వేశాడని ధ్వజమెత్తారు.
తాము అద్దెకు ఇచ్చిన నివాసంలో అసాంఘిక కార్యకలాపాలు కొనసాగుతున్నాయంటూ తమకు ఫిర్యాదులు వచ్చాయని నౌహీరా షేక్ తెలిపారు. దీంతో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందామని తాము ఇంటికి వెళ్లామని చెప్పారు .
విచిత్రం ఏమిటంటే బాధితులకు అండగా ఉండాల్సిన పోలీసులు ఉన్నట్టుండి తమపై కేసు నమోదు చేశారని వాపోయారు నౌహీరా షేక్. రాజకీయ నాయకులు తెలుసంటూ తమ ముందే ఫోన్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.