మోదీ ప్రభుత్వం లీకేజీల పర్వం
నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ – డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ పదే పదే ఊదరగొడుతూ వస్తున్న మోదీ ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో ఘోరంగా విఫలమైందని సంచలన ఆరోపణలు చేశారు ఏఐసీసీ మాజీ చీఫ్ , వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
సంవత్సరాల తరబడి నిరీక్షించిన అనంతరం యూపీలో జాబ్స్ భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చారని పేర్కొన్నారు. సుదీర్ఘ కాలం తర్వాత చేపట్టిన పరీక్షను కూడా సరిగా నిర్వహించడంలో నిర్లక్ష్యం వహించారని, దీంతో వేలాది మంది నిరుద్యోగుల ఆశలు ఆవిరై పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ.
విచిత్రం ఏమిటంటే ఈ ఒక్క పరీక్షకే దాదాపు 60 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారని, ఒక్క యూపీ రాష్ట్రంలోనే 12కు పైగా పోటీ పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయని , దీంతో కోట్లాది మంది రోడ్డున పడ్డారని, దీనికి ప్రధాన కారకుడు ప్రధాని మోదీనేననంటూ మండిపడ్డారు.
యూపీలోనే ఎక్కువగా ఈ లీకేజీలు చోటు చేసుకున్నాయని, వెంటనే విచారణ జరిపించి దోషులు ఎవరో తేల్చాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.