పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు పక్కా
ధీమా వ్యక్తం చేసిన పీఎం మోదీ
న్యూఢిల్లీ – వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ. బలమైన భారత దేశాన్ని నిర్మించడం కోసం ఇప్పటికే బీజేపీతో అనుసంధానం కాని ప్రతి ఒక్కరినీ పదాధికారులు చేరుకునే ప్రయత్నం చేయాలని స్పష్టం చేశారు ప్రధానమంత్రి.
ఇవాళ దేశంలోని 143 కోట్ల మంది ప్రజానీకం సుస్థిరమైన, సమర్థవంతమైన పాలనను కోరుకుంటున్నారని అన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. మన ముందున్న లక్ష్యం 400 సీట్లు కైవసం చేసుకోవడమని , ముందు దీనిపై ఫోకస్ పెట్టాలని స్పష్టం చేశారు ప్రధానమంత్రి.
ఏ మాత్రం ఏమరుపాటు పనికి రాదని, ఈ రెండు నెలలు మన పార్టీకి అత్యంత అవసరమని అన్నారు మోదీ. ప్రతిపక్షాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. వారిలోని అనైక్యతను చూసి ఈసడించుకుంటున్నారని స్పష్టం చేశారు. దీనిని మనం గుర్తించి ప్రజలకు కేంద్ర సర్కార్ ఈ పదేళ్లలో చేసిన పనులను వివరించాలని అన్నారు నరేంద్ర మోదీ.
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా మారాలంటే మనం కలిసికట్టుగా ముందుకు సాగాలన్నారు. ‘సబ్ కా సాత్, సబ్ కా విశ్వాస్’ అనేది మన మంత్రమని చెప్పారు.