భాగ్యలక్ష్మి సన్నిధిలో రాజేందర్
ప్రత్యేక పూజలు చేసిన మాజీ మంత్రి
హైదరాబాద్ – మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు ఈటల రాజేందర్ హైదరాబాద్ లోని చార్మినార్ భాగ్యలక్ష్మి గుడికి వెళ్లారు. అక్కడ కొలువు తీరిన అమ్మ వారిని దర్శించుకున్నారు. ఈటల రాజేందర్ తో పాటు సీనియర్ బీజేపీ నాయకులు పూజలు చేశారు. ఈ సందర్బంగా పూజారులు ఆశీర్వచనాలు అందించారు. అమ్మ వారి ప్రతిమతో పాటు ప్రసాదాన్ని ఇచ్చారు.
ఇదిలా ఉండగా అమ్మ వారి దర్శనం అనంతరం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. హిందు, ముస్లింల ఐక్యతకు ఈ ఆలయం ఓ చిహ్నమని పేర్కొన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో , ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మ వారిని కోరుకున్నట్లు తెలిపారు.
నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో సమర్థవంతమైన నాయకత్వం, పాలనను చూసి ప్రజలు తిరిగి బీజేపీకి పట్టం కట్టాలని కోరుకుంటున్నారని జోష్యం చెప్పారు. ఈసారి జరగబోయే ఎన్నికల్లో కాషాయ జెండా రెప రెప లాడడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా తాజాగా జరిగిన శాసన సభ ఎన్నికల్లో ఈటల రాజేందర్ రెండు చోట్ల పోటీ చేశారు. సీఎం కేసీఆర్ చేతిలో, పాడి కౌశిక్ రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు.