కేంద్రంపై రైతన్నల యుద్ధం
రైతు నేత పంథర్ ప్రకటన
న్యూఢిల్లీ – కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్రభుత్వం తమను మోసం చేసిందంటూ నిప్పులు చెరిగారు రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంథర్. ఈనెల 21న మరోసారి ఢిల్లీ ఛలో పాదయాత్రకు పిలుపునిచ్చామని చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ న్యాయ పరమైన డిమాండ్లను పరిష్కరించడంలో కేంద్రం విఫలమైందని ఆరోపించారు.
పలువురు రైతులు ప్రాణాలు కోల్పోయినా వారికి పరిహారం అందించడంలో నిర్లక్ష్యం వహించారంటూ ధ్వజమెత్తారు పంథర్. అందుకే రైతులంతా తిరిగి మరో పోరాటానికి శ్రీకారం చుట్టడం జరిగిందని అన్నారు. ఎన్ని కేసులు నమోదు చేసినా, భాష్ప వాయువులు ప్రయోగించినా తాము తట్టుకుని నిలబడ్డామన్నారు.
అయినా బెదిరే ప్రసక్తి లేదన్నారు పంథర్. తమ యుద్ధం ఆగదని స్పష్టం చేశారు .వేలాది మంది రైతులు ఇవాళ ఎండల్లో నిలబడి నిరసన తెలియ చేస్తున్నారని, అయినా మోదీ సర్కార్ కనిక రించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికే రాజధాని ఢిల్లీకి రాకుండా తమను అడ్డుకునే ప్రయత్నం చేశారంటూ వాపోయారు. కానీ రైతన్నలంతా దాడులను ఎదుర్కొని చేరుకున్నారని, రాజధానిని అష్ట దిగ్బంధనం చేస్తామంటూ హెచ్చరించారు పంథర్.